
తెరాస ప్రభుత్వం గత ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో పేదమహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయగా, అవి చాలా నాసిరకంగా ఉండటంతో వారు తీవ్ర ఆగ్రహంతో రోడ్లపై కుప్పపోసి నిప్పు పెట్టి వాటి చుట్టూ బతుకమ్మ ఆడి ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేశారు. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆ కార్యక్రమం కారణంగానే తీవ్ర అప్రదిష్టపాలైంది.
కనుక ఈసారి ఎటువంటి లోపాలు, అవకతవకలు జరుగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకొని మంచి నాణ్యమైన చీరలను తయారుచేయించి పంపిణీ చేయడంతో రాష్ట్రంలోని పేదమహిళలు వాటిని చూసి మురిసిపోతున్నారు. వాటి కోసం మహిళలు రేషన్ షాపుల ముందు బారులు తీరి నిలబడి మరీ తెచ్చుకొంటున్నారు. దాంతో ఈసారి బతుకమ్మ చీరలకు డిమాండ్ చాలా పెరిగిపోయింది. గతంలో ఒక కుటుంబానికి తెల్లరేషను కార్డులో ఎంతమంది మహిళలు పేర్లు ఉంటే అంతమందికి ఇచ్చేవారు. కానీ ఈసారి చీరల కొరత ఏర్పడటంతో కొన్ని మండలాలలో ఒక కార్డుపై ఒకే చీర ఇస్తున్నారు.
ఉదాహరణకు పెన్‌పహాడ్ మండలంలో తెల్లరేషన్ కార్డులలో 13,522 మంది మహిళలు ఉండగా 11,522 చీరలు మాత్రమే సరఫరా అయ్యాయి. దీంతో చీరలు అందని మహిళలు వీ.ఆర్.ఓలు, రేషన్ డీలర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం మండలాలవారీగా మహిళలను లెక్కించడంలో పొరపాటు జరిగినందునే తక్కువ చీరలు సరఫరా అయ్యాయని, త్వరలోనే మిగిలిన మహిళలకు కూడా చీరలు పంపిణీ చేస్తామని అధికారులు చెపుతున్నారు. ఇటువంటి చిన్న లోపాలను కూడా సవరించుకొంటే ఈ పధకం కూడా విజయవంతంగా అమలవుతుంది. అప్పుడు రాష్ట్రంలో నేతన్నలకు చేతి నిండా పని దొరుకుతుంది. రాష్ట్రంలో మహిళలు సంతోషించి ప్రభుత్వాన్ని దీవిస్తారు.