నేనెక్కడకు వెళ్ళాలి? మధుసూదనాచారి ప్రశ్న

మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి చందూలాల్‌ సోమవారం భూపాలపల్లిలో తెరాస కార్యకర్తలతో సమావేశమైనప్పుడు వారిరువురి మాటలు వినీ అందరూ కంట తడిపెట్టారు. మధుసూదనాచారి కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మన నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ళు కట్టించిన తరువాతే నేను ఇల్లు కట్టుకోవాలనుకొన్నాను. అందరికీ చేయలేకపోయినా కొంతమందికి ఇళ్ళు ఏర్పాటు చేయగలిగాను. కనుక సమావేశం ముగిసిన తరువాత మీరందరూ మీ ఇళ్ళకు వెళ్ళిపోతారు. కానీ సొంత ఇల్లులేని నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు,” అని ఛలోక్తిగా అన్నప్పుడు అక్కడున్నవారందరి కళ్ళలో నీళ్ళు కారాయి. 

“అయితే నేను అధైర్యపడను. మీరందరూ నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపుతునప్పుడు నాకు ఇంతకంటే ఏమి కావాలనిపిస్తుంది. నేను ఎప్పటికీ మీ మధ్యనే ఉంటాను. మీ సంస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటాను,” అని మధుసూదనాచారి అన్నారు. 

అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి చందూలాల్‌, “ఈ మీడియా వాళ్ళు నామీద ఎందుకు ఇంత పగపట్టారో తెలియదు కానీ ఎన్నికలయ్యేవరకు నాగురించి పిచ్చిపిచ్చి వార్తలు వ్రాస్తూ నా విజయావకాశాలను దెబ్బ తీశారు. నా నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి పనులేవీ వారికి కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే నావాళ్ళు అనుకున్నవాళ్ళే ఈ ఎన్నికల సమయంలో నన్ను ఘోరంగా దెబ్బతీశారు,” అని కంట తడిపెట్టారు. అది చూసి తెరాస కార్యకర్తలు కూడా కంట తడిపెట్టారు.