
ఉమ్మడి రాష్ట్రంలో విశిష్టమైన సేవలను రోగులకు అందించి, అందరి మన్ననలు పొందిన ఆరోగ్యశ్రీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను గురువారం నుంచి నిరవధికంగా నిలుపుదల చేస్తున్నట్లు తెలంగాణ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ ఆసోసియేషన్ (తానా) కన్వీనర్ డా॥ఎల్. సురేష్ గౌడ్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం గత ఐదు నెలల నుంచి తమకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించక పోవడంతో 300 కోట్ల రూపాయలకు పైగా పేరుకుపోయాయని, దీంతో తాము ఆసుపత్రులను నడింపిచలేని పరిస్థితి తలెత్తిందని అన్నారు.
ప్రభుత్వంతో చర్చల్లో ఇస్తున్న హామీలను నెరవేర్చడం లేదన్నారు. చర్చలు సానుకులంగా ఉన్నప్పటికీ తమకు మాత్రం ప్రయోజనం కల్గించడం లేదని అందుకే తాము ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఆరోగ్యసేవలను నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలంటే ప్రభుత్వం ముందుగా తమతో కుదుర్చుకున్నట్లు చెబుతున్న ఎంఒయులోని ఏకపక్ష నిర్ణయాలను విడనాడి తమ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న ఎంఒయు వల్ల తమకు ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన మొత్తం బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. తాము సూచించిన టారిఫ్ రేట్లను కూడా అమలు చేయాలని, అప్పటివరకు తమ సేవలను నిలిపి వేస్తామన్నారు. తాము వ్యాపార దృక్పథంతో సేవలు చేయడం లేదని, నామ మాత్ర లాభాలతో సామాన్య ప్రజలకు సేవలను అందిస్తున్నామన్నారు. చూస్తుంటే ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా ఉందని చెప్పారు. ప్రైవేట్ వైద్యానికి భయపడు సగటు రోగికి కొండంత అండగా నిలిచింది ఆరోగ్యశ్రీ. మరి ప్రభుత్వ నిర్లక్షమో లేదంటే ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాకమో తెలియదు కానీ ఆరోగ్యశ్రీ మీద నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం వెంటనే దీనిపై నష్టనివారణ చర్యలు తీసుకోవాలి.