ఈసారి నాణ్యమైన బతుకమ్మ చీరలు

గత ఏడాది బతుకమ్మ చీరల పంపిణీలో జరిగిన లోపాల కారణంగా ప్రభుత్వానికి ఎంతో గొప్ప పేరు తెచ్చిపెట్టవలసిన ఆ పధకం తీరని అప్రదిష్ట కలిగించింది. కనుక ఈసారి ఎటువంటి తప్పులు జరుగకుండా చేనేతశాఖా మంత్రి కేటిఆర్ స్వయంగా ఎప్పటికప్పుడు చీరల తయారీపని పురోగతిని సమీక్షిస్తున్నారు. అధికారులతో కలిసి ఆయన శనివారం సిరిసిల్లా చేనేత సంఘాల ప్రతినిధులతో, మాక్స్ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ సెప్టెంబర్ చివరికల్లా 90 లక్షల బతుకమ్మ చీరలను తయారుచేసి అందించాలని కోరారు. అయితే ప్రస్తుతం ఉన్న 10,000 మరమగ్గాలతో ఆ లక్ష్యం చేరుకోవడం కష్టమని కనుక మరో 20,000 మగ్గాలు ఏర్పాటు చేయవలసి ఉంటుందని మాక్స్ సంఘాల ప్రతినిధులు చెప్పారు. కానీ ఇప్పటికిప్పుడు అన్ని మగ్గాలు ఏర్పాటు చేయడం కష్టం కనుక ప్రస్తుతం ఉన్న మగ్గాలపై మూడు షిఫ్టులలో చీరల తయారీ కొనసాగించాలన్న అధికారుల సూచనకు మాక్స్ సంఘాల ప్రతినిధులు అంగీకారం తెలిపారు.

ఈసారి బతుకమ్మ పండుగకు వారం రోజుల ముందుగానే చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి చీరల తయారీ, నాణ్యత, పంపిణీ విషయంలో ఎటువంటి లోపాలు, విమర్శలకు తావివ్వకుండా అధికారులు నిరంతరం నేత సంఘాలతో టచ్చులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి కేటిఆర్ ఆదేశించారు. ఎన్నికలకు ముందు జరుగుతున్న కార్యక్రమం ఇది కనుక ఈసారి దీనిలో ఎటువంటి లోపాలు తలెత్తినా అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. కనుక ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది.