అదే నిర్లక్ష్యం...అదే విషాదం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ, గోదావరినదులలో వరుసగా పడవప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేకమంది ప్రాణాలు పోగొట్టుకొంటూనే ఉన్నారు. కేవలం మానవ తప్పిదం లేదా నిర్లక్ష్యం కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నా ఆ విషాదఘటనల నుంచి ఎవరూ గుణపాఠాలు నేర్చుకోకపోవడం విస్మయం కలిగిస్తుంది. 

తూర్పుగోదావరి జిల్లాలో ఐ.పోలవరం మండలంలో పశువుల్లంక వద్ద శనివారం సాయంత్రం నాటుపడవ మునిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు సమీపంలో ఉన్న గ్రామస్తులు పడవలో ఉన్న 25మందిని రక్షించగలిగారు. కానీ ఆరుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. 

వారి గ్రామంలో పాఠశాలలో 7వ తరగతి వరకు మాత్రమే భోధిస్తారు కనుక 8వ తరగతి నుంచి చదువులకోసం విద్యార్ధులు అందరూ రోజూ నాటు పడవలో అవతలి ఒడ్డున ఉన్నపాఠశాలకు వెళ్ళక తప్పని పరిస్థితి. శనివారం సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత స్వగ్రామానికి తిరిగివస్తున్నప్పుడు పడవ మునిగిపోయింది. 

దాని సామర్ధ్యానికి మించి మనుషులను ఎక్కించుకోవడమే కాకుండా కొన్ని ద్విచక్రవాహనాలను కూడా ఎక్కించుకోవడమే ఈ ప్రమాదానికి కారణం. ఎగువనున్న ధవళేశ్వరం బ్యారేజీ నుంచి బారీగా నీటిని విడుదల చేస్తుండటంతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అటువంటప్పుడు పడవ ప్రయాణం దుస్సాహసమే. పైగా పడవ సామర్ధ్యానికి మించి మనుషులను, వాహనాలను ఎక్కించుకోవడం ఇంకా పెద్ద తప్పు. దానికి విద్యార్ధులు, ఒక గృహిణి  మూల్యం చెల్లించవలసివచ్చింది. 

ప్రమాదం సంగతి తెలియగానే 64 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్, 74మందితో కూడిన ఏపి ఎస్డిఆర్ఎఫ్ సహాయబృందాలు అక్కడకు చేరుకొని గాలింపుచర్యలు మొదలుపెట్టాయి. విశాఖ నుంచి నేవీ, కోస్ట్ గార్డు బృందాలు, గజఈతగాళ్ళు కూడా వచ్చారు. పడవ మునిగిన ప్రాంతం నుంచి కొంచెం దూరంలోనే సముద్రముంది. గోదావరినది అక్కడే సముద్రంలో కలుస్తుంది. కనుక నదిలో మునిగిపోయిన పిల్లలు సముద్రంలోకి కొట్టుకుపోయే అవకాశం ఉంది కనుక సముద్రంలో కూడా సహాయబృందాలు గాలింపుచర్యలు చేపడుతున్నాయి. కానీ ఒకపక్క వర్షం, ఈదురుగాలులు కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. నిన్న ఆదివారం రోజంతా గాలించినా గల్లంతైన విద్యార్ధుల ఆచూకీ లభించలేదు. గెల్లా నాగమణి (30) అనే ఒక మహిళ మృతదేహం మాత్రం లభించింది.

గల్లంతైన విద్యార్ధులలో అక్కా చెల్లెళ్ళు అనూష (9వ తరగతి), సుచిత్ర (6వతరగతి), పోలిశెట్టి మనీషా (10వ తరగతి) కొండేపూడి రమ్య (9వ తరగతి), సుంకర శ్రీజ (10వ తరగతి), తిరుకోటి ప్రియ (8వ తరగతి), గెల్లా నాగమణి (30) గృహిణి ఉన్నారు. వారిలో నాగమణి మృతదేహం ఒక్కటే లభించింది. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు ముమ్మురంగా సాగుతున్నాయి. 

ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆ విదార్దుల తల్లితండ్రులు, బంధువులు గోదావరి ఒడ్డునే కూర్చొని పిల్లల కోసం విపలపిస్తుంటే వారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. ఈ ప్రమాదంలో చనిపోయిన నాగమణి కుటుంబానికి రూ.5 లక్షలు, ఆరుగురు పిల్లల కుటుంబాలకు ఒక్కోరికి రూ.3 లక్షలు నష్టపరిహారం ఇస్తామని ఏపి సర్కార్ ప్రకటించింది.