
రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణాలో భాజపా ఏ పార్టీతోను పొత్తులు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో తెదేపాతో పొత్తులు పెట్టుకోవడం గత ఎన్నికలలో నష్టపోయామని ఈసారి స్వశక్తితోనే రెండు రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి గట్టిగా ప్రయత్నిద్దామని అమిత్ షా అన్నారు. కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల కంచుకోట వంటి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గట్టిగా కృషి చేయడంతో భాజపా చాలా బలపడిందని కానీ ఒకప్పుడు ఎంతో బలంగా ఉండే తెలంగాణాలో భాజపా బలహీనంగా మారిందని దానికి పార్టీ నేతలే బాధ్యత వహించాలని అమిత్ షా అన్నారు. ఏపితో పోలిస్తే తెలంగాణా రాష్ట్ర భాజపా నేతల పనితీరు సంతృప్తికరంగా లేదని, పార్టీ నేతలు ఇదేవిధంగా వ్యవహరిస్తుంటే రాష్ట్రంలో ఎప్పటికైనా అధికారంలోకి రాగలమా? అని అమిత్ షా పార్టీ నేతలను ప్రశ్నించారు.
తెలంగాణా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను చూసి రాష్ట్ర భాజపా నేతలు వెనకడుగు వేయవలసిన అవసరంలేదని, రాష్ట్రంలో వివిధ వర్గాలకు కేంద్రప్రభుత్వం అంతకంటే చాలా ఎక్కువే ఇస్తోందని గుర్తుంచుకోవాలని అన్నారు. ఉదాహరణకు తెలంగాణా ప్రభుత్వం పంటపెట్టుబడిగా రైతులకు ఎకరానికి రూ.4000 ఇస్తుంటే కేంద్రప్రభుత్వం వివిధ పంటల గిట్టుబాటు ధరలు పెంచడం ద్వారా ఒక్కో రైతుకు రూ.12,000 చొప్పున అందిస్తోందని చెప్పారు. కనుక పార్టీ నేతలందరూ జిల్లాలలో పర్యటిస్తూ రాష్ట్రంలో అమలవుతున్న కేంద్రప్రభుత్వ పధకాల గురించి ప్రచారం చేయాలని కోరారు.