
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కనుక మళ్ళీ నాలుగేళ్ళ తరువాత మొదటిసారిగా కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు ముందువచ్చి మాట్లాడారు.
డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీ కారణంగానే నాకు, మా కుటుంబానికి ఇన్ని పదవులు, పేరు, గౌరవం లభించాయి. కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం వంటిది. ఈరోజు మళ్ళీ నా కుటుంబంలోకి తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏపిలో తెదేపా, వైకాపాలు రెండూ విభజన హామీలను అమలుచేయించడం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యాయి. కనుక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు కలగాలన్నా, విభజన హామీలన్నీ అమలుకావలన్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి... రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలసిన అవసరం ఉంది. అప్పుడే తెలుగు రాష్ట్రాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయి. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరుచుకొని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకొందాము. నేను ఒక సామాన్య కార్యకర్తగానే పార్టీలో చేరాను. పార్టీ అధిష్టానం నాకు ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తాను. రాజకీయాల గురించి మరోసారి ఎప్పుడైనా మాట్లాడుతాను,” అని ముగించారు.