కొత్త జిల్లాలపై కేసీఆర్ కు ఎందుకంత పట్టు?

తెలంగాణ సర్కార్ ఏర్పాటు తర్వాత కొత్తగా జిల్లాల పునర్విభజన జరగాలని కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. గతంలో ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాలను తాను జిల్లాలుగా ప్రకటిస్తానని చెప్పిన మాట వాస్తవమే కానీ ఇన్ని జిల్లాలను ఏర్పాటు చేశారని మాత్రం ఎవరూ ఊహించలేదు. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కొత్తగా 14 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. మొత్తం 24 జిల్లాలతో తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ది చేసేందుకు కేసీఆర్ భారీ స్కెచ్ సిద్దం చేశారు.

తెలంగాణ జనాభా 3.60 కోట్లు. 10 జిల్లాలు. జిల్లా సగటు జనాభా 36 లక్షలు. తెలంగాణ విస్తీర్ణం 1.14 లక్షల చదరపు కిలోమీటర్లు. జిల్లా సగటు విస్తీర్ణం 11 వేల కిలోమీటర్లు. దేశంలో జిల్లా సగటు 18 లక్షలైతే తెలంగాణ సగటు 36 లక్షలు. ఈ కారణాలతో పాటు పరిపాలనా సౌలభ్యం. ప్రజలకు సౌకర్యం అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టినట్లు కెసిఆర్ వెల్లడిస్తున్నారు.  ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలనే నిబంధన ఏమీ లేదని, ఒక అసెంబ్లీ నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించవచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరున్న మండలాలను అదే జిల్లాలో ఉంచడంతో పాటు, మండల కేంద్రానికి దగ్గరున్న గ్రామాలను అదే మండలంలో చేర్చాలని ప్లాన్ వేస్తున్నారు.

అయితే కొత్త జిల్లాల ఏర్పాటు ఓ రాజకీయ ఎత్తుగడ అనే వాదనను కేసీఆర్ అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రజల డిమాండ్లను, ప్రజల సౌకర్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. చిన్న జిల్లాలు ఉంటే పరిపాలన బాగుంటుందని, ఒక్కో కుటుంబం పరిస్థితి తెలుస్తుందని, పేద కుటుంబాలను గుర్తించి, వారిని ఆదుకునే అవకాశముంటుందన్నారు. జిల్లా కేంద్రాలంటే కేవలం జిల్లా కేంద్రాలే కాదని, అవి అభివృద్ధి కేంద్రాలుగా మారాలని, ఆ దిశగా మన ప్రణాళికలు, ఆలోచనలు ఉండాలన్నారు. తెలంగాణ వృద్ధి రేటు బాగుంది. దాని ఫలితాలు పేదలకు అందాలని ఆలోచిస్తున్నారు. మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటులో కేసీఆర్ మంచి విజన్ తో ముందుకు సాగుతున్నారు.