
ఇటీవల విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, “ఈ సినిమా టైటిల్ గురించి విన్నప్పుడు మొదట నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే రోడ్ల పరిస్థితి గురించి వర్ణించడానికి న్యూస్ పేపర్ల వాళ్ళు ‘ఈ నగరానికి ఏమైంది?’ అని టైటిల్ పెడుతుంటారు. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిని కనుక ఈ సినిమా పేరు చూసి కొంచెం కంగారుపడ్డాను కానీ ఈ సినిమా ఆ సమస్యల గురించి కాదని తెలిసిన తరువాత ప్రశాంతంగా వచ్చాను,” అని అన్నారు.
నిజానికి ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి గురించి చెప్పుకోవలసివస్తే మళ్ళీ అదేవిధంగా ‘ఈ నగరానికి ఏమైంది?’ అని హెడ్డింగ్ పెట్టుకోక తప్పదు. బుధవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలలో అనేక ప్రాంతాలలో కుండపోతగా వర్షం పడుతోంది. ఈరోజు మధ్యాహ్నానికి కొన్ని ప్రాంతాలలో వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ అనేక ప్రాంతాలలో ఇంకా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది.
భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో నగరవాసులు అందరికీ తెలుసు. షరా మామూలుగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అనేక ప్రాంతాలలో ఇళ్ళలోకి నీళ్ళు చేరాయి. చాలా ప్రాంతాలలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దాంతో ద్విచక్రవాహనదారులు ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాల పుణ్యామని మెట్రో రైళ్ళలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఒకపక్క బారీ వర్షం, మరోపక్క నీళ్ళు నిండిన రోడ్లపై వాహనాలు నడుపలేక చాలా మంది మెట్రో రైళ్ళను ఆశ్రయిస్తున్నారు.
ఈరోజు ఉప్పల్, బేగంపేటలో 2.3 సెం.మీలు, మల్కాజ్ గిరిలో 2.7 సెం.మీలు, పటాన్ చెరులో 3.1 సెం.మీలు వర్షపాతం నమోదు అయ్యింది. నగరంలో ప్రధాన ప్రాంతాలైన మోండా మార్కెట్, ఖైరతాబాద్, కోఠి తదితర ప్రాంతాలలో రోడ్లపై నీళ్ళు నిలిచిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులుపడ్డారు. భారీవర్షాల కారణంగా ట్రాఫిక్ మెల్లగా కదలుతుండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. నగరంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నందున జి.హెచ్.ఎం.సి.అధికారులు, సిబ్బంది ఈ సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరొక 24గంటల పాటు ఇదే వాతావరణం కొనసాగవచ్చని వాతావరణశాఖా అధికారులు చెపుతున్నారు. ఇంకా ఇలాగే బారీవర్షం కొనసాగితే మళ్ళీ 'ఈ నగరానికి ఏమవుతుంది?' అని ప్రశ్నించుకోక తప్పదేమో?