చంద్రబాబు అధ్యక్షతన వరంగల్ లో తెదేపా సభ!

చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళారంటే ఎవరూ ఆశ్చర్యపోరు కానీ తెలంగాణాలో పర్యటిస్తారంటే అది సంచలన వార్త అవుతుంది. కారణాలు అందరికీ తెలుసు. కానీ అయన త్వరలో వరంగల్ నగరంలో రాష్ట్ర తెదేపా నిర్వహించబోయే బహిరంగసభలో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ అర్బన్ అధ్యక్షుడు ఈగ మల్లేశం బుధవారం ప్రకటించారు.

నగరంలో అండర్ బ్రిడ్జి వద్ద కొత్తగా తెదేపా కార్యాలయం ఏర్పాటుచేశారు. జిల్లా మరియు నగరానికి చెందిన తెదేపా నేతలు తమ కొత్త కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగ మల్లేశం తెరాస సర్కార్, సిఎం కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెరాస నాలుగేళ్ళపాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కు వెళ్ళిపోయిందని అన్నారు. రైతుల కోసం తెరాస సర్కార్ కొత్తగా చేసిందేమీ లేదని రైతుబంధు పధకం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అమలు చేసినదేనని వ్మర్శించారు. తెదేపా హయంలోనే తెలంగాణా చాలా అభివృద్ధి చెందిందని కనుక రాష్ట్రంలో మళ్ళీ తెదేపా అధికారంలోకి వస్తేనే గాడిన పడుతుందని అన్నారు. త్వరలోనే వరంగల్ నగరంలో బారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని దానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారని ఈగ మల్లేశం చెప్పారు. 

తెలంగాణాలో తెదేపా ఇంకా తన ఉనికిని చాటుకొంటూనే ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. అయితే తెదేపా నేతలు కలలు కంటున్నట్లు రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రాలేదని స్పష్టమయింది. కనుక వచ్చే ఎన్నికలలో కనీసం గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకోగలిగితే అది గొప్ప విషయమే అవుతుంది. కనుక ఆ లక్ష్యంతో టిటిడిపి నేతలు కృషి చేస్తే మంచిదేమో కదా? ఒకవేళ చంద్రబాబు నాయుడు నిజంగానే వరంగల్ బహిరంగ సభకు హాజరైనప్పటికీ ఇప్పుడు అయన తెలంగాణా ప్రజలను ప్రభావితం చేయగలరని ఆశించలేము. ఆ విషయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలోనే రుజువైంది కదా! మరి ఆయనను రప్పించి ఏమి ప్రయోజనం?