టీవీ ఛానల్స్ పై పోలీస్ నిఘా?

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వాటిని నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద పాదయాత్రకు పూనుకొన్నప్పుడు వారిద్దరి వల్ల నగరంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని చెప్పి పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ చేశారు. ఆ కారణంగా కూడా వారిరువురినీ సమర్ధించే వర్గాలు అందోళనలకు సిద్దపడ్డాయి. ఈ అంశంపై కూడా పలు టీవీ ఛానళ్ళలో చర్చాకార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 

ఇటువంటి చర్చా కార్యక్రమాలు ఒక సున్నితమైన సమస్యను పరిష్కరించడానికి దోహదపడితే అందరూ హర్షిస్తారు కానీ పరస్పరం వ్యతిరేకించుకునే రెండు వర్గాలను టీవీ స్టూడియోలకు పిలిపించి ఇటువంటి సున్నితమైన అంశంపై వాదోపవాదాలు చేయించడం వలన సంబంధిత వర్గాలను ఇంకా రెచ్చగొట్టినట్లవుతుంది. దాని వలన శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. టీవీ ఛానళ్ళు తమ టి.ఆర్.పి రేటింగ్ పెంచుకోవడం కోసం చేసే ఇటువంటి ప్రయత్నాల వలన కొన్నిసార్లు సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తుతుంటాయి. ఇటువంటి చర్చా కార్యక్రమాలే కాక టీవీ ఛానళ్ళలో ప్రసారమయ్యే అనేక మతపరమైన, సామాజికపరమైన వార్తలు కూడా ఆయా వర్గాల మద్య దూరం పెంచి విద్వేషాలు రగుల్చడానికి కారణం అవుతున్నాయి. 

కనుక ఇక నుంచి రాష్ట్రంలో టీవీ ఛానళ్ళలో ప్రసారమయ్యే మతపరమైన, సామాజికపరమైన వార్తలను, చర్చా కార్యక్రమాలపై నిఘా పెట్టి పరిధి అతిక్రమించినవాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది. దీనికోసం హైదరాబాద్ నగర పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తాజా సమాచారం.