హైదరాబాద్ పై కుట్ర.. 11 మంది అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

రాష్ట్రంలో భారీ ఎత్తున పేలుళ్లకు ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) భగ్నం చేసింది. ఏకంగా 11 మంది ఐఎస్‌ అనుమానిత ఉగ్రవాదులను పాతబస్తీలో జరిపిన స్పెషల్‌ ఆపరేషన్‌లో ఎన్‌ఐఏ, నగర పోలీసులు పట్టేశారు. వీరి దగ్గరి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో పాటు, రివాల్వర్లు, కరెన్సీని ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకున్నది. ఎన్‌ఐఏ అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లో కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌తో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు దాని భావాజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని, పేలుడు పదార్థాలు, ఆయుధాలను సమకూర్చుకొని రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కుట్ర పనినట్టు ఎన్‌ఐఏకు విశ్వసనీయ సమాచారం అందింది.

ఈ సమాచారంతో నెల రోజులుగా ఎన్‌ఐఏ, రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పాతబస్తీలో దృష్టి సారించింది. తమకు అందిన సమాచారం నిజమేనని తెలుసుకున్న ఎన్‌ఐఏ అధికారులు నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ ఐజీ సజ్జనార్‌లతో కలిసి పాతబస్తీలోని అనుమానిత ప్రాంతాలపై దాడికి యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించారు.  పాతబస్తీలోని చంద్రాయణగుట్ట, బార్కస్‌, ఫలక్‌నుమా, భవానీ నగర్‌, తలాబ్‌కట్ట, మొగల్‌పుర తదితర ప్రాంతాలలోని కొన్ని ఇండ్లపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మంది ఐఎస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న అనుమానిత ఉగ్రవాదులను పట్టుకున్నారు. అరెస్టు చేసిన 11 మందిని కోర్టులో హాజరుపరిచింది ఎన్ఐఎ. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్ఐఎ అప్రమత్తత నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.