
ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు, కాంట్రాక్టర్లకు, కార్పోరేట్ కంపెనీలకు మద్య ఉండాల్సిన అడ్డుగోడలు తొలగిపోవడంతో ప్రభుత్వాలను కాంట్రాక్టర్లు, కార్పోరేట్ కంపెనీలే నడుపుతున్నాయనిపిస్తోంది. దానినే కాస్త పద్దతిగా చెప్పుకోవాలంటే ‘ప్రభుత్వాలపై కాంట్రాక్టర్లు, కార్పోరేట్ కంపెనీల ప్రభావం’ అని చెప్పుకోవచ్చు. కనుక ప్రభుత్వాలు వాటి ప్రయోజనాలను కాపాడటం కోసం ఆరాటపడితే ఆశ్చర్యమేమీ లేదు. అందుకు తాజా ఉదాహరణగా దేశంలో పేరుమోసిన ఉన్నత విద్యాసంస్థలలో ‘జియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిలయన్స్ ఫౌండేషన్’ పేరును చేర్చడమే.
దేశంలో రెండు ఐఐటిలు (ముంబై, డిల్లీ), బిట్స్ పిలానీ, మణిపాల్ ఉన్నతవిద్యా అకాడమీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులను ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలని కేంద్రమానవవనరుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. వాటితోపాటు అంబానీల ‘జియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిలయన్స్ ఫౌండేషన్’ పేరును కూడా చేర్చింది. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇంతవరకు అది స్థాపించబడలేదు. కొన్ని నెలల క్రితం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జియో ఇన్స్టిట్యూట్ ను స్థాపించాలనుకొంటున్నామని అన్నారు. అంతే! దాని స్థాపనకు ఇంకా ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ ఇంకా ప్రారంభం కానీ ఆ సంస్థకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ప్రఖ్యాత సంస్థగా ప్రకటించేసింది! ఏమంటే గ్రీన్ ఫీల్డ్ కేటగిరీలో దానికి ఆ గుర్తింపు ఇచ్చామని ఆ శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ సమర్ధించుకోవడం విశేషం. అంబానీలను ప్రసన్నం చేసుకోవడానికే కేంద్రం ఇంత అత్యుత్సాహం చూపిందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.