
రాష్ట్రంలో పంచాయితీల పదవీకాలం పూర్తవక మునుపే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, అందుకు విరుద్దంగా జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బిసి జనాభా లెక్కలు టీసి తదనుగుణంగా రిజర్వేషన్లను నిర్దారించడంలో ఆలస్యం జరగడం, రిజర్వేషన్లపై న్యాయవివాదాలు మొదలవడంతో పంచాయితీల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు జరిపించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం వద్ద ఉన్న జనాభాలెక్కల ప్రకారం బిసిలకు 34 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 7శాతం కలిపి మొత్తం 61 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రమేష్ రంగనాథన్ లతో కూడిన హైకోర్టు ధర్మాసనం సోమవారం దానిపై విచారణ చేపట్టి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వరాదని స్పష్టం చేసింది.
కనుక పంచాయితీ ఎన్నికల కధ మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని పంచాయితీలకు కలిపి 50 శాతంలోపు రిజర్వేషన్లు ఉండేలా సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. చేసిన తరువాత ఆ వివరాలను మళ్ళీ హైకోర్టుకు తెలియజేసి దాని అనుమతి పొందవలసి ఉంటుంది. దానిపై మళ్ళీ ఎవరైనా తమకు అన్యాయం జరిగిందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేస్తే దానినీ ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక పంచాయితీ ఎన్నికలు నిర్వహించదానికి కనీసం మరో నెలరోజులైనా పట్టే అవకాశం ఉంది.