రాష్ట్రంలో కొత్తగా 14 జిల్లాలు

పది జిల్లాల తెలంగాణ స్వరూపం తొందరలోనే మారనుంది. మొత్తం 24 జిల్లాలతో తెలంగాణ రూపురేఖలను మార్చేందుకు కేసీఆర్ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా కేసీఆర్ ఉన్నతాధికారుల సమావేశాన్ని నిర్వహించి దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.  పైగా ఈ అంశంలో ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు.

“కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం అనుకున్న రీతిలో అభివృద్ధి చెందాలి. కొత్త అభివృద్ధి కేంద్రాలు రావాలి. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు కావాలి. ఇప్పటి దాకా ఉన్న ప్రతిపాదనల ప్రకారం 14 జిల్లాలు, 73-74 మండలాలు కొత్తగా ఏర్పా టయ్యే అవకాశం ఉంది” అని టిఆర్‌ఎస్ అధి నేత, సిఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అంతిమంగా ప్రజల అభీష్టం మేరకు జిల్లాల పునర్విభజన జరగాలని, ఒక్కో జిల్లాకు సగటున 20 మండలాలు ఉంటాయన్నారు.

జిల్లా కేంద్రానికి దగ్గరున్న మండలాలను అదే జిల్లాలో చేర్చాల్సి ఉన్నదని, ఎక్కువ జనాభా కలిగిన నగరాలు, పట్టణాలను అర్బన్ మండలాలుగా చేర్చే ప్రతిపాదన ఉందని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో జిల్లాల పునర్విభజన ఎప్పటికప్పుడు జరిగినా పశ్చిమబెంగాల్ ఆంధ్రప్రదేశ్‌లో జరగలేదని, దాంతో జిల్లా యూనిట్‌గా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. అలాగే నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు వంటివి కొత్తవి రావాలని, అందుకే కొత్త జిల్లాలు కావాలని చెప్పారు.