తెరాస ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం?

ఆర్టీసి చైర్మన్, రామగుండం తెరాస ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సోమవారం ఉదయం ఒక సంచలన ప్రకటన చేశారు. రామగుండంలో అయన మీడియాతో మాట్లాడుతూ, “జిల్లాలో కొందరు పార్టీ నేతలు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అధిష్టానానికి చెప్పినా పట్టించుకోవడంలేదని ఈ పరిస్థితులలో తాను ఇక పార్టీలో కొనసాగలేనని కనుక రాజకీయ సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను,” అని చెప్పారు. 

గత కొన్ని నెలలుగా ఆయనకు, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణకు మద్య విభేదాలు కొనసాగుతుండటంతో మంత్రి కేటిఆర్ వారిద్దరితో మాట్లాడారు. కానీ ఆ తరువాత వారి విభేదాలు మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. ఎమ్మెల్యే సత్యనారాయణ తెరాస, కాంగ్రెస్, భాజపా కార్పోరేటర్లను కూడగట్టి మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసతీర్మానం నోటీస్ ఇప్పించడంతో రామగుండంలో తెరాస రెండు వర్గాలుగా చీలిపోయింది. మొన్న శనివారం కార్పోరేషన్ స్టాండింగ్ కమిటీలో 5 స్థానాలకు ఎన్నికలు జరుపగా వాటిలో ఎమ్మెల్యే వర్గం మూడు స్థానాలను, మేయర్ వర్గం, కాంగ్రెస్ పార్టీలు చెరో స్థానం గెలుచుకొన్నాయి. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే సత్యనారాయణ ఈరోజు ఉదయం రాజకీయ సన్యాసం చేస్తానని అధిష్టానానికి తుది హెచ్చరిక పంపారు. కనుక రామగుండంలో తెరాసకు నష్టం కలుగకుండా నివారించేందుకు తెరాస అధిష్టానం ఈ సమస్యపై ఏ వర్గంపై చర్యలు తీసుకొంటుందో చూడాలి.

సంబంధిత వార్త: http://www.mytelangana.com/telugu/latest-news/12490/trs-mayor-pulled-down-by-trs-mla-with-congress-bjp-support