కత్తి మహేష్ కు నగర బహిష్కరణ

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టినీ ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆరు నెలలపాటు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టవద్దని ఆదేశిస్తూ డిజిపి మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వంటనే హైదరాబాద్ పోలీసులు అతనిని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పజెప్పారు. ఎందుకంటే కత్తి మహేష్ స్వస్థలం ఏపిలో చిత్తూరు జిల్లా కనుక. భావప్రకటన స్వేచ్చ పేరుతో సమాజంలో ఇతరుల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమని డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. 

ఇటీవల ఒక టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రెండు హిందూ సంస్థలు ఆయనపై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాయి. కత్తి మహేష్ పై చట్ట ప్రకారం కటినచర్యలు తీసుకోవాలని కోరుతూ  స్వామి పరిపూర్ణానంద మరొకడుగు ముందుకువేసి సోమవారం యాదాద్రి నుంచి హైదరాబాద్ నగరం వరకు పాదయాత్రకు సిద్దం అయ్యారు. ఆయనతో కలిసి వేలాదిమంది హిందువులు పాదయాత్రకు సిద్దమయ్యారు. వారి పాదయాత్ర వలన రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు భంగం కలుగవచ్చని భావించిన హైదరాబాద్ పోలీసులు స్వామి పరిపూర్ణానందను ఈరోజు గృహనిర్బంధంలో ఉంచారు.