
ప్రతీపార్టీలో నేతల మధ్య విభేదాలు సహజమే కానీ స్వంతపార్టీకే చెందిన మేయర్ పై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టడం తెరాసకే చెల్లింది. అందుకోసం అది ప్రతిపక్ష పార్టీల మద్దతు తీసుకోవడం ఇంకా విచిత్రం. రామగుండంలో తెరాస ఎమ్మెల్యే సత్యనారాయణకు, మేయర్ లక్ష్మినారాయణకు మద్య చాలా కాలంగా విభేదాలున్నాయి. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.200 కోట్లు నిధుల కేటాయింపులు, వాడకం విషయంలో వారి మద్య విభేదాలు రాజుకున్నాయి. ఆ కారణంగా పట్టణంలో అభివృద్ధిపనులు నత్తనడకన సాగుతున్నాయి.
మేయర్ సత్యనారాయణపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. జూలై 3వ తేదీతో పాలకవర్గం పదవీకాలం నాలుగేళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రత్యర్ధులైన కాంగ్రెస్, భాజపాలకు చెందిన 11 మంది మద్దతుతో తెరాసకు చెందిన 28మంది కలిసి మొత్తం 39 మంది కార్పొరేటర్లు మేయర్ కె. లక్ష్మి నారాయణ, డిప్యూటీ మేయర్ ఎస్. శంకర్ లపై అవిశ్వాసతీర్మానం నోటీసును పెద్దపల్లిజిల్లా కలెక్టర్ కు అందజేశారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కౌన్సిల్ సమావేశం నిర్వహించవలసిందిగా వారు కలెక్టరును కోరారు. జిల్లాలో తెరాసలో జరుగుతున్న ఈ అంతర్యుద్దంపై తెరాస అధిష్టానం ఇంకా స్పందించవలసి ఉంది.