.jpg)
ఎన్నికలతో సంబంధం లేకుండా సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు ఓ సరికొత్త పధకాన్ని ప్రవేశపెడుతుంటారు. అవి ఎన్నికలలో లబ్ది పొందేందుకేనని ప్రతిపక్షాలు వాదిస్తుంటాయి. ఈ వాదోపవాదాలలో నిజానిజాలు పక్కనపెట్టి సిఎం కెసిఆర్ తన పని తాను చేసుకుపోతుంటారు. తాజాగా రాష్ట్రంలోని బిసి, ఎంబిసిల కోసం మరో కొత్తపధకాన్ని సిద్దం చేస్తున్నారు. బ్యాంకులతో ఎటువంటి సంబంధమూ లేకుండా రూ.1-2 లక్షలు విలువచేసే యూనిట్లను 100 శాతం ప్రభుత్వ గ్రాంటుగా అందించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయవలసిందిగా కోరారు. యూనిట్లు అంటే బహుశః గొర్రెలు, మేకలు, బర్రెలు లేదా స్వయం ఉపాధికి అవసరమైన యంత్రాలు కావచ్చు. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన శనివారం సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు సమావేశమయ్యి ఈ పధకాన్ని ఏవిధంగా అమలుచేయాలో చర్చించి ఖరారు చేయనున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఇటువంటి కొన్ని పధకాలు అమలవుతున్నప్పటికీ వాటిలో 75 శాతం వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తే మిగిలింది లబ్దిదారుడు భరించవలసి వచ్చేది. కానీ ఈ పధకంలో ప్రభుత్వమే 100 శాతం ఆర్ధిక సహాయం అందిస్తుంది కనుక లబ్దిదారులపై ఏమాత్రం ఒత్తిడి ఉండదు. కానీ రూ.1-2 లక్షలు ఉచితంగా లభిస్తాయంటే అందరూ ఎగబడవచ్చు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే బారీగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది.