
ప్రశ్నించడం కోసమే రాజకీయాలలోకి వచ్చేను తప్ప అధికారం కోసం కాదని బ్యానర్లు కట్టుకొని మరీ చెప్పుకొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మెల్లగా తన మనసులో కోరికను నిన్న బయటపెట్టేశారు.
గురువారం సాయంత్రం అయన విశాఖలో నిర్వహించిన బహిరంగసభలో తన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రజల అభిమానం, ఆదరణ, ఆశీర్వాదం లేనిదే ఎవరూ ఎన్నికలలో గెలవలేరు. డబ్బుతో రాజకీయాలు చేసి అధికారం సంపాదించుకొనే అవకాశమే ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యుండేవారు. పైన ఆ దేవుడి దయ...ఇక్కడ మీ అందరి ఆశీస్సులు ఉంటే నేను తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాను. నేను పార్టీ పెడితే కులపిచ్చితో పెట్టానని తెదేపా ఆరోపిస్తోంది. నాకే కులపిచ్చి ఉన్నట్లయితే గత ఎన్నికలలో స్వయంగా పోటీ చేయకుండా భాజపా, తెదేపాలకు ఎందుకు మద్దతు ఇస్తాను? వారు చెప్పినదానికల్లా బుర్ర ఊపితే మంచివాడిని. వారిని ప్రశ్నించినా..వారిపై ఎన్నికలలో పోటీ చేసినా కులపిచ్చి ఉందని, ఇంకా ఏవేవో ఆరోపణలు చేస్తారు. ఇదెక్కడి రాజకీయం?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.