
వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అలవాటున్న భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి, “కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తే తప్పకుండా ఫెయిల్ అవుతారని నేను చెప్పగలను,” అని వ్యంగ్యంగా అన్నారు.
పంజాబ్ రాష్ట్రం అనగానే చక్కటి పాడిపంటలు గుర్తుకు వస్తాయి. వాటితోపాటు ఇప్పుడు మాదకద్రవ్యాల సరఫరా, అమ్మకాలు, సేవించడం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ సమస్యపై ‘ఉడ్తా పంజాబ్’ అనే ఒక సినిమా కూడా వచ్చింది. రెండేళ్ళ క్రితం జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికలలో మాదకద్రవ్యాల సమస్యే ప్రధాన అంశంగా మారింది. కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యవస్థలను సమూలంగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చాయంటే పంజాబ్ లో ఈ సమస్య ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
పంజాబ్ రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న ఈ సమస్యను అరికట్టడంలో భాజపా-అకాలీదళ్ సంకీర్ణ ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయ్యింది కానీ అది కూడా ఈ సమస్యను నిర్మూలించలేకపోయింది. కానీ దీనిపై ఒక వివాదస్పద నిర్ణయం తీసుకొని విమర్శలు ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో అనేకమంది రోజూ మాదకద్రవ్యాలు సేవించి కార్యాలయాలకు వస్తున్నారనే అనుమానంతో అందరికీ డోపింగ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. ముందు మంత్రులు, ప్రజాప్రతినిధులకు డోపింగ్ టెస్ట్ లు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
పంజాబ్ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మద్య దీని గురించి వాదోపవాదాలు జరుగుతుంటే మద్యలో సుబ్రహ్మణ్య స్వామి తలదూర్చి రాహుల్ గాంధీ డోపింగ్ టెస్ట్ చేస్తే ఫెయిల్ అవుతారని అనడంతో కాంగ్రెస్ నేతలు ఆయనపై విరుచుకు పడుతున్నారు.