గ్రామ పంచాయితీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం

ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం సీజన్లలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ‘సమ్మెల సీజన్’ మొదలైనట్లుంది. కొన్ని రోజుల క్రితమే ఆర్టీసి కార్మికులు సమ్మెకు సిద్దమయ్యారు. వారికి నచ్చజెప్పి సమ్మెను విరమింపజేయగానే రేషన్ డీలర్లు సమ్మె ప్రారంభించారు. వారికి కూడా నచ్చజెప్పి సమ్మె విరమింపజేయగానే ఇప్పుడు గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్దమయ్యారు. వారు జూన్ 20వ తేదీనే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం స్పందిస్తుందని ఇంతవరకు ఓపికగా ఎదురుచూశారు.  

పంచాయితీ ఎన్నికల దగ్గర పడినప్పుడు వారు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నిధానంగా వ్యవహరిస్తుండటం విశేషం. బిసి జనాభా లెక్కలు ఇంకా తేలకపోవడంతో ఎన్నికలు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కనుకనే నిదానంగా వ్యవహరిస్తోందేమో? తమ సమ్మె నోటీస్ పై ప్రభుత్వం స్పందించకపోవడంతో గ్రామ పంచాయితీ ఉద్యోగుల జెఏసి రాష్ట్ర కమిటీ సభ్యులు బుధవారం హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశయ్యారు. ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే సమ్మె ప్రారంభిద్దామని నిర్ణయించారు. కనుక సమ్మెకు అందరూ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.