
ఏపి భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ బుధవారం నెల్లూరు జిల్లా కావలిలో ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక తెదేపా కార్యకర్త ఆయనపైకి చెప్పులు విసిరాడు. వెంటనే అక్కడున్న భాజపా కార్యకర్తలు అతనిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. తమ పార్టీ అధ్యక్షుడిపై దాడి చేసినందుకు నిరసనగా భాజపా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు.
ఈ ఘటనపై కన్నా లక్ష్మినారాయణ స్పందిస్తూ, “తెదేపా తన దుష్టబుద్ది మరోమారు బయటపెట్టుకొంది. ఇంతకాలం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే కేంద్రప్రభుత్వంపై బురదజల్లుతున్న తెదేపా, ఇప్పుడు ఓర్వలేనితనంతో భౌతికదాడులకు కూడా పాల్పడుతోంది. ఇటువంటి వాటికి మేము భయపడబోము. తెదేపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచుతాము. వచ్చే ఎన్నికలలో వారే తెదేపాకు తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.