
డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కు సుప్రీంకోర్టు ఈరోజు సున్నితంగా చివాట్లు పెట్టింది. డిల్లీకి రాష్ట్ర హోదా లేనప్పటికీ ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం ఉంది. కానీ అది లెఫ్టినెంట్ గవర్నర్ అధీనంలో నడుస్తుంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేంద్రం గవర్నర్ ను అడ్డంపెట్టుకొని తమ ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకొంటూ తమను పనిచేసుకోనీయకుండా అడ్డుపడుతోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టు తుదితీర్పు చెప్పింది.
ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా చదివి వినిపించారు.
“కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు, ఫెడరల్ స్ఫూర్తి కలిగి ఉండాలి. గవర్నర్ తో సహా ప్రతీ ఒక్కరూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవలసి ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వానికి సహకరించాలి తప్ప దాని పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. అలాగే మంత్రి మండలి నిర్ణయాలను అడ్డుకోకూడదు. లెఫ్టినెంట్ గవర్నర్ కు ప్రత్యేకాధికారాలు ఏమీ ఉండవు. ఒకవేళ డిల్లీ ప్రభుత్వంతో ఏమైనా అభిప్రాయభేదాలు వస్తే ఆ విషయాన్ని రాష్ట్రపతికి నివేదించాలి తప్ప ప్రభుత్వంపై స్వయంగా చర్యలకు ఉపక్రమించరాదు. అలాగే డిల్లీ ప్రభుత్వం కూడా మంత్రివర్గ నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ కు తెలియజేయాలి. డిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వవలసిన అవసరం లేదు,” అని తీర్పు చెప్పారు.
గత మూడేళ్ళుగా డిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు. అది భరించలేక సిఎంకేజ్రీవాల్ అయన మంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసంలో వారంరోజుల పాటు నిరశనదీక్షలు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పడంతో ఇకపై లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వ వ్యవహారాలలో వేలుపెట్టే సాహసం చేయకపోవచ్చు.