వరంగల్ లో ఘోర అగ్నిప్రమాదం

వరంగల్ లో కోటిలింగాల వద్ద గల భద్రకాళి ఫయార్ వర్క్స్ లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు. మరో 8 మంది తీవ్రగాయాలపాలైయ్యారు. మంటలను అదుపు చేసేందుకు రెండు ఫైరింజన్లు పనిచేస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది వరకు ఆడ, మగ కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. కనుక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది. టపాసులు నిలువ ఉంచే గోదాములో చిన్నగా నిప్పు రాజుకొని క్షణాలలో అంతటా వ్యాపించినట్లు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న కార్మికులు చెపుతున్నారు. ఏమి జరుగుతోందో అర్ధమయ్యేలోపుగానే మంటలు చుట్టుముట్టాయని చెప్పారు. 

ఈ ప్రమాదం ధాటికి చుట్టుపక్కల ఇళ్ళ గోడలు బీటలు వారాయి. ఇళ్ళలో ట్యూబులైట్లు, బల్బులు, టీవీలు పగిలిపోయాయి. సుమారు కిమీ దూరం వరకు ప్రేలుళ్ళు వినిపించాయని, భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. 

మంటలలో కాలిపోయినవారి శవాలను గుర్తుపట్టలేనంతగా మాడిమసయిపోయాయి. కొంతమంది మాంసం ముద్దల్లా మారిపోయారు. చనిపోయినవారి బంధువుల ఆక్రందనలతో పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి.  ఈ ప్రమాదం సంగతి తెలియగానే స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. గాయపడినవారిని స్థానిక ఎం.జి.ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.