
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణాలో అన్ని పార్టీలు ప్రజలలోకి దూసుకుపోతుండటంతో రాష్ట్ర భాజపా నేతలు కూడా జనచైతన్యయాత్రల పేరుతో తెలంగాణాలో పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వారి యాత్ర నిన్న ఆర్మూరు చేరుకొన్నప్పుడు అక్కడ నిర్వహించిన బహిరంగసభలో లక్ష్మణ్ సిఎం కెసిఆర్ పై తీవ్రవిమర్శలు గుప్పించారు.
“ఆర్టీసి కార్మికులు జీతాలు పెంచమని అడిగితే ఆర్టీసిని మూసేస్తామని బెదిరిస్తారు. రేషన్ డీలర్లు తమ సమస్యలను చెప్పుకొంటే లైసెన్సులు రద్దు చేసేస్తామని బెదిరిస్తారు. కౌలురైతులు పంటపెట్టుబడికి సహాయం చేయమని అడిగితే వారిని అవహేళన చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. సిఎం కెసిఆర్ ప్రవర్తన చాలా అహంకారపూరితంగా ఉంది. అయన పాలన అప్రజాస్వామికంగా సాగుతోంది. ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ నిరంకుశత్వం ప్రదర్శిస్తున్నారు. ఆయనకు బుద్ధి చెప్పేరోజు దగ్గరలోనే ఉంది. రాష్ట్ర ప్రజలు ఇదివరకు కాంగ్రెస్, తెదేపాలకు అవకాశం ఇచ్చారు. తరువాత తెరాసకు ఇచ్చారు. వాటి పాలన ఎంత ఘోరంగా ఉందో అందరూ చూశారు. కనుక వచ్చే ఎన్నికలలో భాజపాకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు పంటరుణాలు మాఫీ చేస్తాము. వడ్డీని కూడా మేమే చెల్లిస్తాము,” అని లక్ష్మణ్ అన్నారు.
ఇదివరకు మోడీ నామస్మరణతో తెలంగాణా భాజపా అధికారంలోకి వచ్చేస్తుందని బల్లగుద్ది వాదించిన భాజపా నేతలు, ఇప్పుడు కొత్తపల్లవి అందుకోవడం విశేషం. “అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు కనుక మాకూ ఒక్క ఛాన్స్ ఇవ్వరా ప్లీజ్” అంటూ తెలంగాణా ప్రజలను వేడుకోవడం విశేషం. అంటే మోడీ నామస్మరణతో ఫలితం ఉండదని గ్రహించారా?