.jpg)
తమ పార్టీ నేత తెరాసలోకి వెళ్ళిపోకుండా కాపాడుకోవాలని టి-కాంగ్రెస్ ఆరాటం. ఆ నేతను ఎలాగైనా తెరాసలోకి రప్పించుకోవాలని తెరాస ఆరాటం. ఆ నేత పేరు ముఖేష్ గౌడ్. అయన కోసం ఆ రెండు పార్టీల నేతల ఆరాటం చూస్తే నవ్వొస్తుంది.
ఆదివారం అయన పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్-బై చెప్పేసి తెరాసలో చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆదివారం ఉదయం తన క్యాంప్ కార్యాలయంలో అనుచరుల సమక్షంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న తరువాత మీడియాతో మాట్లాడుతూ తాను తెరాసలో చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ప్రకటించడం విశేషం.
అయన ఆ మాట చెప్పిన కొద్దిసేపటికే గ్రేటర్ హైదరాబాద్ తెరాస అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు హడావుడిగా అక్కడకు చేరుకొని ముఖేష్ గౌడ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ తరువాత కాసేపు ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకొన్నారు. కానీ ఆ తరువాత ముఖేష్ గౌడ్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈ సంగతి తెలుసుకొన్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హడావుడిగా అక్కడకు చేరుకకొని ముఖేష్ గౌడ్ కు శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాసేపు ఆయనతో ఏకాంతంగా మాట్లాడి పార్టీ మారవద్దని నచ్చచెప్పారు. ఒకసారి గాంధీభవన్ కు వచ్చినట్లయితే అన్నివిషయాలు ఏఐసిసి కార్యదర్శుల సమక్షంలో మాట్లాడుకొందామని చెప్పగా ముఖేష్ గౌడ్ సానుకూలంగా స్పందించారు.
వారి సమావేశం ముగిసిన కొద్దిసేపటి తరువాత కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు కూడా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే బిసిలకు సముచిత గౌరవం లభిస్తోందని వారి సమక్షంలోనే ముఖేష్ గౌడ్ మీడియాకు తెలిపారు.
వారు అటు వెళ్ళగానే, మళ్ళీ తెరాస నేత మైనంపల్లి హనుమంతరావు ముఖేష్ గౌడ్ నివాసానికి వచ్చారు. ఈసారి అనేకమంది తెరాస కార్యకర్తలను వెంటబెట్టుకొని బాజాభజంత్రీలతో మరీ వచ్చారు. వారిరువురూ సుమారు గంటసేపు ఏకాంతంగా సమావేశమయిన తరువాత మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ, “గ్రేటర్ హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ ఒక బలమైన నాయకుడు. అయనను బాజాభజంత్రీలతో తెరాసలోకి తీసుకువెళ్ళడానికే వచ్చాము. త్వరలోనే అయన తన నిర్ణయం ప్రకటిస్తారు,” అని చెప్పడం విశేషం.
అప్పుడు ముఖేష్ గౌడ్ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనిస్తే అయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేక తెరాసలో చేరాలో తెలియక ఇంకా ఊగిసలాడుతున్నారని అర్ధమవుతోంది.
తెరాస చాలా బలంగా ఉందని, కాంగ్రెస్ లో ఉన్నవారందరూ అవినీతిపరులు, తెలంగాణా ద్రోహులే అని వాదిస్తున్న తెరాస అదే పార్టీ నేతను పార్టీలోకి రప్పించుకోవడానికి ఇంతగా ఆరాటపడటం హస్యస్పదంగా ఉంది.