మర్యాదపూర్వకంగానే కలిసారుట!

కాంగ్రెస్ నేత సుబ్బిరామిరెడ్డి మనవడి వివాహానికి హాజరయ్యేందుకు మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత దేవగౌడ ఆదివారం హైదరాబాద్ వచ్చినప్పుడు సిఎం కెసిఆర్ ను ప్రగతిభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. సిఎం కెసిఆర్ ఆయనకు శాలువ కప్పి సత్కరించి చార్మినార్ ప్రతిమను బహుకరించారు. ఇద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. కానీ ఇద్దరూ చాలా కార్యక్రమాలకు హాజరుకావలసి ఉన్నందున ఎక్కువసేపు మాట్లాడుకోలేకపోయారు. 

కర్ణాటకలో జెడిఎస్ కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆ రెండు పార్టీల నేతలమద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండటంతో జెడిఎస్ ఇప్పుడు భాజపావైపు చూస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో దేవగౌడ సిఎం కెసిఆర్ ను కలవడం విశేషం. అయితే వారి మద్య రాజకీయ చర్చలేవీ జరుగలేదని అయన మర్యాదపూర్వకంగా కెసిఆర్ ను కలిసారని తెరాస వర్గాలు తెలిపాయి.