కౌలురైతులు శత్రువులా?

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పధకం ఒక ఉద్దేశ్యంతో అమలుచేస్తే దానిపై అనేక విమర్శలు, న్యాయవివాదాలు ఎదురవుతున్నాయి. కౌలురైతులకు ఈ పధకం వర్తింపజేయకుండా ధనిక భూస్వాములు, సినీతారలు, రాజకీయ నాయకులకు పంటపెట్టుబడిగా బారీగా సొమ్ము ముట్టజెప్పడాన్ని కౌలురైతులు, ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. 

రైతులకు పంటపెట్టుబడి అందించడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1. రైతుకు అవసరమైన పరిస్థితిలో పంటపెట్టుబడి అందించడం ద్వారా సహాయపడటం. తద్వారా రైతులు అప్పులవాళ్ళ బారిన పడకుండా కాపాడటం. 2. ఈ పేరిట రైతులకు ఆర్ధికసహాయం చేసి వారిని ప్రసన్నం చేసుకొని ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందడం. వీటిలో మొదటి కారణం ఎంత వాస్తవమో రెండవదీ అంతే వాస్తవమని అందరికీ తెలుసు. 

అయితే ఈ పధకంలో నిరుపేదరైతులకు అందిన సొమ్ము కంటే భూస్వాములు, రాజకీయ నాయకులకు అందిందే ఎక్కువగా కనిపిస్తుండటమే విమర్శలకు తావిస్తోందని చెప్పవచ్చు. అదే సమయంలో నిజంగా చాలా అవసరమున్న కౌలురైతులకు ఈ పధకానికి అర్హులు కారని ముఖ్యమంత్రి కెసిఆర్ పదేపదే చెపుతుండటం చాలా కరుకుగా వినిపిస్తోంది. 

ఈ విషయంలో ఆయన వాదన సరైనదే కావచ్చు కానీ ప్రభుత్వ సహాయం ఏమాత్రం అవసరంలేని భూస్వాములకు, రాజకీయ నాయకులకు ఇవ్వడానికి లేని అభ్యంతరాలు, నిబంధనలు వ్యవసాయంపైనే ఆధారపడి బ్రతుకుతున్న నిరుపేద కౌలురైతులకు ఇవ్వడానికి అడ్డువస్తున్నాయా? అనేది వారి వాదన. 

ఇదే పధకం ద్వారా కాకపోయినా వేరే మరోవిధంగానైనా తమను ప్రభుత్వం ఆదుకోవాలని కౌలురైతులు ఆశిస్తే తప్పు, నేరమూ కాదు. కెసిఆర్ అవునన్నా కాదన్నా కౌలురైతులు రైతులు కాకుండాపోరు. వారు వ్యవసాయమే తప్ప మరొకటి చేయలేరు. కనుక వారిని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై తప్పక ఉంది.

దీని ద్వారా రాజకీయలబ్ది పొందాలని తెరాస అనుకొన్నప్పుడు భూమి ఉన్న రైతులకు ఆర్ధిక సహాయం చేసి, కౌలురైతులకు చేయకపోతే తెరాస ఆశించిన ఫలితం లభించదు. పైగా సిఎం కెసిఆర్ పదేపదే వారు ఈ పధకాన్ని అనర్హులు అని చెపుతున్న మాటలు వారి మనసులను ఇంకా గాయపరుస్తున్నాయని మరిచిపోకూడదు. రాష్ట్రంలో లక్షలాదిమంది కౌలురైతులున్నారు. వారి ఆగ్రహానికి తెరాస గురికాక తప్పదని గ్రహించాలి.

దీనిద్వారా తెరాస రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది కనుక సహజంగానే ప్రతిపక్షాలు దానిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తాయి. కౌలురైతులను పక్కన పెట్టడంద్వారా వాటికి సిఎం కెసిఆరే ఆ అవకాశం కల్పిస్తున్నారని చెప్పకతప్పదు. తమ పట్ల వివక్ష చూపుతున్నందుకు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కౌలురైతులకు ప్రతిపక్షాలు అందుకే మద్దతు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 

ఈ పధకం గురించి తెలంగాణాతో సహా ఇతర రాష్ట్రాలలో కూడా గొప్పగా ప్రచారం చేసుకొని మంచి పేరు సంపాదించుకోవాలని తెరాస ఆశిస్తే విమర్శలు, కోర్టుకేసులు ఎదుర్కోవలసివస్తోంది. అంటే తెరాస ఆశించింది ఒకటైతే ఫలితం మరొకలా వస్తోందని స్పష్టం అవుతోంది. దీనికంతటికీ మూలకారణం కౌలురైతులను పక్కన పెట్టడమే. కనుక వారికీ మేలు చేసేవిధంగా తెరాస సర్కార్ మరేదైనా పధకం ప్రవేశపెడితేనే తెరాస ఆశించిన ఫలితం వస్తుంది. అది ఎలాగో కెసిఆరే ఆలోచించుకోవాలి.