కౌలు రైతులంటే అంత చులకనా?కోదండరాం

తెలంగాణా జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కౌలురైతులు, రేషన్ డీలర్ల పట్ల సిఎం కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టారు. “వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్న కౌలురైతుల పట్ల మీకు ఎందుకు అంత చిన్నచూపు? వారేమైనా భూయాజమాన్యపు హక్కులు కావాలని అడుగుతున్నారా? రైతులందరికీ ఇస్తున్నట్లే తమకీ పంట పెట్టుబడికి ఆర్ధికసహాయం సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు? కానీ సిఎం కెసిఆర్ వారికి సహాయం చేయకపోగా పదేపదే వారిని అంత చులకన చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? కౌలురైతులకు న్యాయం జరిగే వరకు మేము వారి తరపున పోరాడుతాం. పోనీ రైతుబంధు పధకంలో అర్హులైన రైతులందరికీ చెక్కులు అందాయా అంటే అదీ లేదు. నేటికీ చాలా మందికి చెక్కులు, పాసుపుస్తకాలు అందలేదు. ఇచ్చిన పాసుపుస్తకాలలో అన్నీ తప్పులే,” అని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.

రాష్ట్రంలో 17,000 మంది రేషన్ డీలర్లు తమ సమస్యలు చెప్పుకొని ఆదుకోమని ప్రభుత్వాన్ని వేడుకొంటుంటే వారిని సస్పెండ్ చేయడం ఏమిటి?వారికి టిజెఎస్ అండగా నిలబడుతుంది. ఉపాద్యాయుల బదిలీలలో కూడా తెరాస నాయకులు చాలా అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్ ఆప్షన్స్ లో అనేక అక్రమాలు జరిగాయి. వాటిపై విచారణ జరిపిస్తే అధికార పార్టీకి చెందిన అనేకమంది పేర్లు బయటకు వస్తాయి,” అని ఆరోపించారు.

సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే యోచన చేయడంపై స్పందిస్తూ, “ఐదేళ్ళు పాలించమని ప్రజలు అధికారం కట్టబెడితే చాతకాకనే దిగిపోతానని అంటున్నారు,” అని ఎద్దేవా చేశారు.