బాబుకి మోత్కుపల్లి శాపాలు

తెదేపా బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులుకు చంద్రబాబు నాయుడుపై ఇంకా ఆగ్రహం చల్లారినట్లు లేదు. ఇవాళ్ళ మళ్ళీ చంద్రబాబును నోరారా తిట్టిపోశారు. ఈరోజు అయన హైదరాబాద్ లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “ చంద్రబాబుకు అందరినీ మోసం చేసే దురలవాటుంది. పిల్లనిచ్చిన మామ స్వర్గీయ ఎన్టీఆర్ మొదలు గాలి ముద్దుకృష్ణమనాయుడివరకు అందరినీ వాడుకొని పక్కన పడేశారు. ఇప్పుడు దళితతేజం పేరుతో ఏపిలో దళితులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నా 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు అంత దిగజారిన రాజకీయ నాయకుడిని చూడలేదు. వచ్చే ఎన్నికలలో అయన మొహం చూసి ఎవరూ ఓట్లేయరు. అయన కారణంగానే తెదేపాను ప్రజలు మట్టికరిపించడం ఖాయం. తెదేపాలో చంద్రబాబు కంటే నేనే సీనియర్ ని. అయినా ఏనాడూ నాకు సముచిత గౌరవం ఇవ్వలేదు. ఆయనకు దళితులు అంటే చిన్నచూపు. అందుకే నన్ను అంత తేలికగా తీసిపడేశారు. నేను జూలై 11వ తేదీన తిరుపతి వెళుతున్నాను. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోవాలని ఆ వెంకన్నను కోరుకొంటాను. ఆయన ఓడిపోతే చాలు నాకు పెద్ద పదవి వచ్చినంత సంతోషిస్తాను,” అని అన్నారు. 

మోత్కుపల్లి ఈవిధంగా చంద్రబాబుకు పిల్లి శాపాలు పెడుతూ కాలక్షేపం చేయడం వలన ఆయనకేమీ నష్టం కలుగదు కానీ వైకాపా వంటి పార్టీల చేతిలో పావుగా మిగిలిపోయి చివరికి నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం తెదేపాతో బందం తెగిపోయింది కనుక ఇప్పుడు ఏ పార్టీలో చేరాలో ఆలోచించుకొని ప్రయత్నాలు చేసుకొంటే మంచిది. లేకుంటే ఎన్నికలు దగ్గర పదేసమయానికి అన్ని పార్టీలు ‘నో వేకెన్సీ’ బోర్డులు పెట్టేసే ప్రమాదం ఉంది.