ముందస్తు ఆలోచన ఎందుకో? జానారెడ్డి

కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, కె.జానారెడ్డి తదితరులు ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గద్వాల్ వచ్చినప్పుడు ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం ఇవ్వాలనుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను గృహ నిర్బంధం చేయడం సరికాదని, అది చాలా అప్రజాస్వామిక చర్య అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 

రేషన్ డీలర్ల సమస్యలను సానుభూతితో పరిష్కరించే ప్రయత్నం చేయకుండా వారిపై చర్యలు తీసుకోవడాన్ని జానారెడ్డి తప్పు పట్టారు. “ముందస్తు ఎన్నికలకు వెళదామా?” అని కాంగ్రెస్ పార్టీని కెసిఆర్ సవాలు చేయడంపై స్పందిస్తూ, “అయన ప్రభుత్వానికి ఐదేళ్ళు పరిపాలించమని ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయన ప్రభుత్వంలో, పార్టీలో అంతర్గతంగా ఏదైనా తీవ్ర సమస్య ఏర్పడిందా?ముందస్తు అంటున్నారు? 

సాధారణంగా రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు అంటే శాంతిభద్రతల సమస్యలు వంటివి ఏర్పడినప్పుడు మాత్రమే ప్రభుత్వాలను రద్దు చేయాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటి పరిస్థితులేవీ కనిపించడంలేదు. మరి సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ఎందుకు కోరుకొంటున్నారు? 

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రతిపక్షపార్టీలు సిద్దంగా ఉంటాయి. ఉండాలి కూడా. మా కాంగ్రెస్ పార్టీ కూడా సిద్దంగానే ఉంది. కానీ అధికారంలో ఉన్న పార్టీ ఎటువంటి బలమైన కారణం చూపకుండా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడితే ఎవరైనా ఆక్షేపిస్తారు.

సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్రమోడీని కలిసి వచ్చిన తరువాత ఈ మాట అన్నారు కనుక బహుశః మోడీ చెపుతున్నట్లుగా డిసెంబరులో జమిలి ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనతోనే ఈ ముందస్తు ప్రస్తావన చేశారేమో? ఏది ఏమైనప్పటికీ గత నాలుగేళ్ళలో ఏనాడూ ఈవిషయంలో కూడా ప్రతిపక్షాలను సంప్రదించని సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్దామా? అని మమ్మల్ని అడగటం దేనికి? వెళ్తే ఎవరు వద్దంటారు?”అని ప్రశ్నించారు.