హైకోర్టు విభజనకు కొత్త డెడ్-లైన్

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడి నాలుగేళ్ళు పూర్తయ్యాయి. కానీ ఇంతవరకు ఉమ్మడి హైకోర్టు విభజన కాలేదు. కారణాలు అందరికీ తెలుసు. హైకోర్టు విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల గురించి అందరికీ తెలుసు. హైకోర్టు విభజన గురించి రాష్ట్ర న్యాయ, దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఒక కొత్త విషయం చెప్పారు. 

గురువారం సిఎం కెసిఆర్ తో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. రెండుమూడు నెలలోపుగా హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తయ్యి జనవరి 2019 నుంచి ఏపిలో హైకోర్టు పనిచేయడం ప్రారంభించే అవకాశాలున్నాయి,” అని చెప్పారు.  

అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు ఏపి సర్కార్ చూపిన భవన సముదాయాల పట్ల హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఏపి సర్కార్ హైకోర్టు ఏర్పాటుకు కొత్త భవనాలను నిర్మించి, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ఆ పనులన్నీ అతిత్వరలో పూర్తవబోతున్నాయని సమాచారం. అందుకే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైకోర్టు విభజనకు కొత్త ముహూర్తం ప్రకటించినట్లున్నారు.