
సిఎం కెసిఆర్ కు గన్నవరం విమానాశ్రయంలో ఏపి నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనస్వాగతం పలికారు. కెసిఆర్ రాక సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి కనకదుర్గమ్మ గుడివరకు ఏపి పోలీస్ శాఖ బారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసింది.
గన్నవరం నుంచి ఆలయం చేరుకొన్న కెసిఆర్ దంపతులకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కెసిఆర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలుచేసి మొక్కు చెల్లించుకున్నారు. 11.29 గ్రాముల బంగారంతో చేయించిన ముక్కుపుడకలో మొత్తం 57 చిన్న చిన్న వజ్రాలు పొదగబడ్డాయి. అర్ధ చంద్రాకారంలో చేయించిన ఆ ముక్కుపుడకలోనే తెలంగాణా రాష్ట్ర పక్షి పాలపిట్టను కూడా అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి మొక్కు చెల్లించుకున్న తరువాత కెసిఆర్ దంపతులు ఆలయ ప్రాంగణంలోగల గణపతి తదితర దేవుళ్ళను కూడా దర్శించుకున్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. కెసిఆర్ దంపతులతో పాటు మంత్రులు నాయిని నర్సింసింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తదితరులు కూడా అమ్మవారి దర్శనం చేసుకొన్నారు.