నేడు పివి జయంతి

మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు 97వ జయంతి నేడు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలో లక్నేపల్లి అయన స్వగ్రామం. ఆ తరువాత వారి తల్లితండ్రులు కరీంనగర్ జిల్లాలో భీమదేవరపల్లి మండలంలో వంగర గ్రామానికి వెళ్ళి స్థిరపడటంతో పివి అక్కడే పెరిగి పెద్దవారయ్యారు. 

అయన 1921, జూన్ 28వ తేదీన జన్మించారు. కనుక స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొనే అవకాశం లభించింది. అప్పుడే అయన కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి భారత ప్రధాని కాగలిగారు. భారతదేశం చాలా క్లిష్టపరిస్థితులలో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు, చాలా ధైర్యంగా ఆర్ధిక సంస్కరణలను అమలుచేసి దేశాన్ని మళ్ళీ గాడిలో పెట్టారు. 

పివి గొప్ప రచయిత, తార్కికుడు, బహుబాషాకోవిధుడు, గొప్ప రాజకీయవేత్త అని అందరికీ తెలుసు. కానీ గాంధీ, నెహ్రూ కుటుంబానికి, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కాకపోవడంతో అంతగొప్ప మేధావికి కాంగ్రెస్ పార్టీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదనే చెప్పాలి. 

అయన 2004, డిసెంబర్ 9న డిల్లీలో గుండెపోటుతో చనిపోయినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం అయన పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరు చూసి యావత్ దేశం విస్తుపోయింది. హైదరాబాద్ లో ఆ మహనీయుడి అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా తీరని అపచారం జరిగిన సంగతి బహుశః తెలుగు ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అయన జీవించి ఉన్నప్పుడే మానావమానాలకు అతీతంగా జీవించిన గొప్ప వ్యక్తి. దేశాన్ని కష్టకాలంలో ఒక కాపుకాసిన పివి నరసింహారావును కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోయినా, గౌరవించకపోయినా తెలుగువారు అందరూ ఎల్లప్పటికీ స్మరించుకొంటూనే ఉంటారు.