
తెలంగాణ ఉద్యమం కాలంలో ఢిల్లీలో సెగలు పుట్టాయి. అక్కడి నాయకుల కాళ్ల కింద నేల కంపించింది. ఇప్పుడు మరోసారి కేంద్రానికి తెలంగాణ అనే పదం వినిపిస్తే భయమేస్తోంది. ఉద్యమం ముగిసి, తెలంగాణ రాష్ట్రం విడిగా కాపురం పెట్టుకొని అంతా సర్దుకుందని అనుకుంటుంటే.. కేంద్రం నిర్లక్షం తెలంగాణకు ఆగ్రహాన్ని కలిగించింది. దాంతో మరోసారి తెలంగాణ పవర్ ను ఢిల్లీకి చూపించే టైం వచ్చిందని.. కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి. దాంతో కేంద్ర మంత్రి సదానందగౌడ్ దీని పై స్పందించారు.
ఉమ్మడి హైకోర్టు విభజన అంశం ఢిల్లీని తాకింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. హైకోర్టు విభజనతో తమకు సంబంధం లేదని తెగేసి చెప్పింది కేంద్రం. విభజన అంశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఒకచోట కూర్చుని తేల్చుకోవలసిన సమస్య అని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టంచేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సదానందగౌడ ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్నీ తెలిసిన కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. విభజన చట్టాన్ని చదవాలని..కేంద్రంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నాకు కూర్చుంటానంటే అభ్యంతరం లేదన్నారు. కేజ్రీవాల్ మాదిరి ప్రవర్తిస్తానంటే కేసీఆర్ ఇష్టం అన్నారు. రెండు రాష్ట్రాల నిర్ణయంతోనే హైకోర్టు విభజన చేయాల్సి ఉంటుందని, రాష్ట్రాల నిర్ణయాలపై కేంద్రం జోక్యం చేసుకోవడం సరికాదని స్పష్టంచేశారు. చంద్రబాబుతో మాట్లాడి ఏపీకి హైకోర్టును తరలించేలా ఒప్పించాలని ఆయన కేసీఆర్ కు సలహా ఇచ్చారు. అంతేకానీ కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు.