డిఎస్ కు డిస్-అపాయింట్మెంట్

తెరాస నేత డి.శ్రీనివాస్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా తెరాస నేతలు సిఎం కెసిఆర్ కు లేఖ వ్రాయడంతో, అయన నేరుగా ముఖ్యమంత్రితోనే మాట్లాడి ఈ విషయం తేల్చుకోవాలనుకున్నారు. అందుకోసం అయన సిఎం కెసిఆర్ అపాయింట్మెంట్ కోరగా ఈరోజు సాయంత్రం నగరంలో అందుబాటులో ఉండాలని ప్రగతి భవన్ నుంచి సమాధానం వచ్చింది. ఆయన సాయంత్రం చాలాసేపు హైదరాబాద్ లో తన నివాసంలో ఎదురుచూశారు. కానీ  ‘ఈరోజు సిఎం కెసిఆర్ అపాయింట్మెంట్ లభించదు కనుక రేపటి వరకు వేచిచూడమని’ ప్రగతి భవన్ నుంచి మరో కబురు వచ్చింది. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు సిఎం కెసిఆర్ విజయవాడకు బయలుదేరుతారు. కనుక ఆలోపుగా ఆయనను కలవడం కుదరకపోవచ్చు. సాయంత్రం విజయవాడ నుంచి తిరిగివచ్చిన తరువాత అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలీదు. ఎల్లుండి గద్వాల్ జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. కనుక డి.శ్రీనివాస్ కు సిఎం కెసిఆర్ అపాయింట్మెంట్ ఎప్పుడు లభిస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. సిఎం కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదని అయన అన్నారు. ఒకవేళ ఆయనను తెరాస నుంచి బహిష్కరించాలని సిఎం కెసిఆర్ భావించినట్లయితే ఇక అపాయింట్మెంట్ అవసరమే ఉండదు. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేయిస్తే సరిపోతుంది.