
రాష్ట్రంలో న్యాయమూర్తులు చేస్తున్న ఉద్యమానికి అంతకంతకు మద్దతుపెరుగుతోంది. ముఖ్యంగా మొన్నటి దాకా కేంద్రం చేస్తుందిలే అని ఊరుకున్న తెలంగాణ సర్కార్ ఇప్పుడు కన్నెర్రజేసింది. అందులో భాగంగా కేసీఆర్ సర్కార్ కార్యచరణకు పూనుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు విభజన మీద నిన్న హోంమంత్రి, న్యాయశాఖ మంత్రులకు లేఖలు రాశారు. వెంటనే హైకోర్టును విభజించాలని వారు అందులో కోరారు. కేంద్రం నుండి సరైన స్పందన రాని నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగాలని కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో ఏపీ న్యాయాధికారుల నియామకాల్లో ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఆప్షన్ తో తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం జరుగుతోందన్నారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్లపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని ఆరోపించారు. న్యాయాధికారులకు జరిగిన అన్యాయంపై అన్ని పార్టీలు స్పందించాలని సూచించారు కవిత. ఆంధ్రా జడ్జిలకు ఇక్కడేం పని అని ప్రశ్నిస్తూ, అక్కడ ఖాళీలున్నాయని.. ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వెంటనే ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కవిత.