మరో 9మంది న్యాయాధికారుల సస్పెన్షన్

తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న న్యాయాధికారుల ధర్నాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సోమవారమే సస్పెండ్ చేయగా.. మరో తొమ్మిది మంది తెలంగాణ న్యాయాధికారుల సంఘం నేతలపై వేటు వేసింది. దీంతో సస్పెండ్ అయిన న్యాయాధికారుల సంఖ్య 11కు చేరింది. మూకుమ్మడి రాజీనామాలు, పాదయాత్రగా రాజ్‌భవన్‌కు తెలంగాణ న్యాయాధికారులు వెళ్లడాన్ని క్రమశిక్షణరాహిత్య చర్యగా భావిస్తూ మరిన్ని కీలక నిర్ణయాలకు హైకోర్టు సిద్ధమవుతున్నదని తెలుస్తోంది. తెలంగాణ న్యాయాధికారులు సైతం ఈ వ్యవహారంలో మడమ తిప్పకుండా అన్యాయాలపై అమీతుమీ తేల్చుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. దీంతో పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది.

ఓ పక్క కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాసినా కానీ న్యాయశాఖ మంత్రి ఇచ్చిన సమాధానం మరోసారి న్యాయాధికారుల ఆగ్రహానికి కారణమవుతోంది. న్యాయశాఖలోని పరిధికి లోబడి తాము చర్యలకు దిగుతామని.. సుప్రీం కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తాము ఎలా తీసుకుంటామని, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ్ అన్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే సామూహిక సెలవులతో నిరనస వ్యక్తం చేస్తున్న న్యాయాధికారులు, మరిన్ని రోజులపాటు సెలవులోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దిగువ కోర్టుల్లో న్యాయవ్యవస్థ స్తంభించిపోయింది.