పంచాయితీ ఎన్నికలు సకాలంలో జరిగేనా?

జూలై నెలాఖరులోపుగా పంచాయితీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ఎన్నికల సంఘం సిద్దం అవుతుంటే, బిసి ఓటర్ల జాబితాలలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం బిసి జనాభా శాతంపై పొంతనలేని మాటలు మాట్లాడుతోందని పిటిషనర్ వాదించారు. పంచాయితీరాజ్ యాక్ట్ 2018 ప్రకారం బిసి కమీషన్ తో సర్వే చేయించి, ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా పిటిషనర్ కోరారు. బిసి ఓటర్ల శాతం ఎంతో ఖచ్చితంగా తెలియకుండా పంచాయితీ ఎన్నికలను జరుపరాదని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. 

పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రాష్ట్రంలో ఎంతమంది బిసి ఓటర్లున్నారో లెక్క తేల్చేందుకు సమగ్ర సర్వేనిర్వహించి ఆ నివేదికను తమకు సమర్పించాలని బిసి కమీషన్ ను ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వం తరపున వాదిస్తున్న అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుకు పలుప్రశ్నలు సంధించారు.   

తెలంగాణా గ్రామపంచాయితీ యాక్ట్ ప్రకారం రాష్ట్రంలో బిసి జనాభా 34 శాతమని, ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో 37 శాతమని, సకలజనుల సర్వేలో 54 శాతమని పేర్కొన్నప్పుడు ఆ మూడింటిలో దేనిని నమ్మాలని ప్రశ్నించారు. తెలంగాణా బిసి కమీషన్ ఇంకా తన సర్వే నివేదికను ఇవ్వక మునుపే ఫైనాన్స్ కమీషన్ బిసి జనాభాపై ఏవిధంగా నివేదిక ఇచ్చిందని న్యాయస్థానం ప్రశ్నించింది. పంచాయితీ ఎన్నికలను నిర్వహించే ముందు బిసి జనాభా ఎంతో లెక్క తేల్చాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయితీల పదవీకాలం ముగుస్తున్నప్పటికీ బిసి జనాభా, ఓటర్ల లెక్కలు తేలకుండా ఎన్నికల నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై నాలుగు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.