మరో ఘనత సాధించిన తెలంగాణా రాష్ట్రం

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన కొద్ది నెలల నుంచే రాష్ట్రంలో మార్పులు కనిపించడం మొదలయిన సంగతి అందరికీ తెలిసిందే. తెరాస సర్కార్ చేపట్టిన అనేక చర్యల మూలంగా తెలంగాణాను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రం బయటపడింది. ఆ తరువాత కధ అందరూ చూస్తూనే ఉన్నారు. సగటున ప్రతీ 3-4 నెలలకొకసారి ఏదో ఒక రంగంలో గణనీయమైన ప్రగతి లేదా మార్పు సాధించినందుకు కేంద్రప్రభుత్వం నుంచి అవార్డులు అందుకొంటూనే ఉంది. తాజాగా కాగ్ ప్రశంశలు అందుకొంది. గడిచిన నాలుగేళ్ళలో తెలంగాణా రాష్ట్ర ఆదాయాభివృద్ధిరేటు గణనీయంగా పెరిగిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం స్వీయ ఆదాయం వృద్ధిరేటు సగటున 17.2 శాతం సాధించిందని పేర్కొంది. 

తెలంగాణా రాష్ట్రం 2015-16 సం.లలో: 13.7 శాతం, 2016-17 సం.లలో: 21.1 శాతం, 2017-18 సం.లలో: 16.8 శాతం సాధించినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. ఆ లెక్కన సగటున 17.2 శాతం వృద్ధిరేటు సాధించిందని పేర్కొంది. శరవేగంగా పెరుగుతున్న ఈ వృద్ధిరేటు కారణంగా ఆదాయాభివృద్ధి విషయంలో దేశంలో తెలంగాణా రాష్ట్రం నెంబర్: 1 స్థానంలో నిలిచింది. 

తెలంగాణా తరువాత స్థానాలలో హరియానా: 14.2 శాతం, మహారాష్ట్ర:13.9 శాతం, ఓడిశా:12.4 శాతం, పశ్చిమ బెంగాల్: 10.3 శాతం వృద్ధిరేటు సాధించినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. 

వీటిలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సుమారు రెండు మూడు దశాబ్దాల క్రితమే పారిశ్రామికంగా చాలా అభివృద్ధి సాధించాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం వాటిని కూడా అధిగమించి ముందుకు దూసుకుపోవడం విశేషం. 

నోట్లరద్దు, జి.ఎస్.టి. వంటి ఎదురుదెబ్బలను తట్టుకొని తెలంగాణా రాష్ట్రం ముందుకు సాగుతుండటమే కాక దేశంలో అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషం కలిగించే విషయమే. ఆర్ధిక క్రమశిక్షణ, ప్రజల తోడ్పాటు కారణంగా ఇది సాధ్యం అయ్యిందని సిఎం కెసిఆర్ చెప్పారు. మున్ముందు తెలంగాణా రాష్ట్రం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుందని సిఎం కెసిఆర్ అన్నారు.