రేషన్ డీలర్ల సమ్మె తప్పదా?

రాష్ట్రంలో రేషన్ డీలర్లు తమకు కూడా కనీస గౌరవవేతనం చెల్లించాలని కోరుతూ జూలై 1వ తేదీ నుంచి సమ్మె ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర పౌరసరఫరా శాఖ కమీషనర్ అకున్ సభర్వాల్ వారితో నిన్న హైదరాబాద్ లో సమావేశమయ్యి సమ్మె ఆలోచన విరమించుకోవలసిందిగా కోరారు. కానీ వారు అందుకు నిరాకరించడంతో, వారి లైసెన్సులు రద్దు చేసి వేరేవారికి అప్పగిస్తామని అకున్ హెచ్చరించారు. అయినా వారు వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి కమీషన్ తో తమ కుటుంబాలు పోషించుకోవడం కష్టమైపోతోందని, అందుకే కనీస గౌరవవేతనం ఇవ్వాలని కోరుతున్నామని, ఒకవేళ ఈ నెలాఖరులోపు ప్రభుత్వం అందుకు అంగీకరించకపోతే సమ్మె చేయడం ఖాయం అని వారు అకున్ సభర్వాల్ కు స్పష్టం చేశారు. వారి సమస్యను ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ తో చర్చిస్తానని, మళ్ళీ రెండు రోజుల తరువాత సమావేశం అవుదామని అకున్ రేషన్ డీలర్లుకు చెప్పారు. 

మరోపక్క వారి సమ్మె కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న పౌరసరఫరా అధికారులు వారిచేత సమ్మె విరమింపజేయడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. జూలై నెల రేషన్ సరుకులు విడిపించుకునేందుకు రేషన్ డీలర్లు ఇంతవరకు డీడీలు తీయకపోవడంతో వారికి నచ్చ చెప్పేందుకు అధికారులు వారిచుట్టూ తిరుగుతున్నారు. కానీ రేషన్ డీలర్లు నిరాకరిస్తుండటంతో, రేషన్ షాపులో ఉపయోగించే కాంటాలు, ఏ-పోస్ మిషన్లు వగైరాలను జప్తు చేసి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అధికారులు నయాన్న భయాన్న వారికి నచ్చ చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు కనుక ఇక రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రేషన్ షాపులు అన్నీ బంద్ అవడం ఖాయం. అప్పుడు వాటిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది పేదప్రజలు చాలా ఇబ్బంది పడతారు.