
జూలై 18వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవుతాయని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్ కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు. జూలై 18వ తేదీ నుంచి ఆగస్ట్ 10 వరకు మొత్తం 18 రోజులు సమావేశాలు జరుగుతాయని మంత్రి అనంత కుమార్ చెప్పారు.
గత సమావేశాలలో ఏపికి ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలుచేయనందుకు నిరసనగా తెదేపా, వైకాపాలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతూ వాటిపై సభలో చర్చ జరగాలని పట్టుబడుతూ ఆందోళన చేయగా, రిజర్వేషన్ బిల్లుపై చర్చ చేపట్టాలని కోరుతూ తెరాస, కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ అన్నాడిఎంకెల ఆందోళనలతో సభా కార్యక్రమాలు దాదాపు స్తంభించిపోయాయి. వాటి ఆందోళనల కారణంగా పార్లమెంటు సమావేశాలు చివరి రోజు వరకు ప్రతీరోజూ వాయిదాపడుతూనే సాగాయి.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తునందున దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఈ పార్లమెంటు సమావేశాలలో తమతమ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఏదో ఒక అంశంతో హడావుడి చేసే అవకాశాలున్నాయి. కనుక సార్వత్రిక ఎన్నికలు జరిగేవరకు పార్లమెంటు సమావేశాలలో అర్ధవంతమైన చర్చలు, నిర్ణయాలు ఆశించడం అత్యాశే అవుతుంది.