దేశవ్యాప్తంగా సంచలనానికి తెలంగాణ రాష్ట్రం వేదికగా నిలివనుంది. దేశంలో మొదటిసారిగా న్యాయమూర్తుల మూకుమ్మడి రాజీనామాతో పరిస్థితి మొత్తం తారుమారవుతుంది. ఏపిలోని జడ్జీలకు తెలంగాణ పోస్టుల్లో ఆప్షన్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తులు మూకుమ్మడి రాజీనామా చేశారు. గత నెలలో దాదాపుగా రెండు వందల మంది ఏపికి చెందిన న్యాయమూర్తులకు తెలంగాణలో ఆప్షన్లు ఇవ్వడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుండి దాదాపుగా150 మంది న్యాయమూర్తులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు జడ్జెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కు లేఖ రాశారు. జడ్జీలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కోర్టుల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోనున్నాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జడ్జీలు హైదరాబాద్ లోని గన్ పార్కు దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లారు. గన్ పార్కు దగ్గర పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసనకు దిగారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల జోక్యంతో రాజ్ భవన్ కు అనుమతించారు పోలీసులు. గవర్నర్ నరసింహన్ ను కలిసి న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు.ప్రాథమిక కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతుందోందటున్నారు జడ్జిలు. నెలరోజులుగా న్యాయాధికారుల జాబితాను రీకాల్ చేయాలని ఆందోళన చేస్తున్నా, మార్పు రాకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. జడ్జీలకు మద్దతుగా జ్యుడీషియరీ ఉద్యోగులు కూడా మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమౌతున్నారు. మూకుమ్మడిగా న్యాయమూర్తులు రాజీనామాలకు సిద్ధపడటం దేశంలో ఇదే ఫస్ట్ టైమ్.