
ప్రజాకవి గూడ అంజయ్య తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ మండలం రాగన్నగూడెంలోని తన నివాసంలో మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలోని లింగాపురంలో ఆయన జన్మించారు. విప్లవగేయ సాహిత్యంలో కీలక పాత్ర పోషించిన అంజన్న, ఎన్నో పాటలతో ప్రజలను ఉర్రుతలూగించారు. ‘‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా’’ అనే పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది… ఈ వాడ మనది…. దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద దండెత్తాయి. "నేను రాను బిడ్డో సర్కార్ దావాఖానాకు, రాజిగా వోరి రాజిగా" వంటి ప్రముఖ గీతాలను ఆయన రచించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం గూడ అంజయ్యను రాష్ట్ర అవార్డుతో సత్కరించింది. “ఊరు మనదిరో…” గీతం 16 భాషల్లోకి అనువాదమై అంజన్నలోని ఆర్తి నలుదెసలకు వ్యాపించేలా చేసింది. గత నెల 8న బోయ జంగయ్య (బోజ) కన్నుమూయగా, నెలన్నరకే మరో గొప్ప రచయిత గూడ అంజయ్యను కోల్పోవడం తెలంగాణ ప్రజా ఉద్యమకారుల్ని కన్నీట ముంచెత్తుతోంది.