మల్లన్న సాగర్‌లో మతలబు ఏంటో..?

తెలంగాణలో ప్రస్తుతం మల్లన్న సాగర్ మీద తీవ్ర చర్చ సాగుతోంది. తెలంగాణ సర్కార్ మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఖచ్చితంగా కట్టి తీరుతామని.. ప్రతిపక్ష నాయకులు మాత్రం అది కట్టనివ్వం అని అంటున్నారు. మెదక్ జిల్లాలో కట్టాలని భావించిన కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వల్ల మెదక్ జిల్లాలోని చాలా ప్రాంతాలు సాగునీటితో తడుస్తాయి. కాగా దీని కింద దాదాపు 12 గ్రామాలు ముందుకు గురికానున్నాయి. ఇక్కడే ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. నిజానికి ఏ ప్రాజెక్టును తీసుకున్నా కానీ ముంపు గ్రామాలు ఉండటం మామూలే. పైగా ప్రభుత్వం ముంపు బాధితులకు నష్టపరిహారాన్ని కూడా అందిస్తామని ప్రకటించింది. కానీ ఇక్కడే ఓ చిన్న తప్పు ఉంది. 

మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ భూసేకరణ, పరిహారంపై ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని ఈ ప్రాజెక్ట్ నిర్వాసిత జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. 2003 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా.. సర్కార్‌ 123 జీవో తెస్తాననడం ఎంతవరకు కరెక్ట్ అని బాధితులు వాపోతున్నారు.  మరోపక్క తెరాస నాయకులు కొంత మంది తమను బెదిరించే వరకు వ్యవహారం వెళ్లింది అని కూడా ముంపు గ్రామాల నిర్వాసితులు వాపోతున్నారు. 

నిజానికి పరిహారాన్ని కోరడంలో తప్పు లేదు.. కానీ అది తమకు న్యాయంగా లేదు అన్నదే నిర్వసితుల వాదన. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల 80 వేలు చెల్లిస్తామనడం కరెక్ట్ కాదని.. తమ దగ్గరి నుండి ఎంత భూమి తీసుకుంటే అంత భూమిని సాగుకు అనువైన ప్రదేశంలో ఇవ్వాలని లేదంటే ఎకరాకు 8లక్షల రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కొంత మంది నిర్వాసితులు హెచ్ఆర్‌సిలో కూడా పిటిషన్ వేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం మీద ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టిడిపిలు గొంతెత్తాయి. జెఎసి నాయకులు కూడా ప్రజలకు అండగా రంగంలోకి దిగారు. ప్రభుత్వం మీద విమర్శలకు తావిస్తున్న సమయంలో తెలంగాణ రైతు సమాఖ్య హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి మల్లన్న సాగర్ ను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించడం విశేషం. మొత్తానికి హరీష్ రావు లాంటి కీలక మంత్రులు కూడా దీని మీద పూర్తి దృష్టిసారించిన నేపథ్యంలో మల్లన్న సాగర్ ప్రాధాన్యత వార్తల్లో నిలిచింది. మరి తెలంగాణ సర్కార్ నిర్వాసితులకు న్యాయం చేసి.. ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తుందో చూడాలి.