
తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ మీద రగడ సాగుతూనే ఉంది. ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ టిడిపి నాయకులు రేవంత్ రెడ్డి, దీక్షకు సిద్దమవుతున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న 12 గ్రామాల ప్రజలకు తాను అండగా నిలుస్తానని అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు దగ్గరలోనే ఉన్న కేసీఆర్ ఫాంహౌజ్ లోని 250 ఎకరాలను 25 కోట్ల రూపాయలకు ఇచ్చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది త్యాగాలు చేస్తే ఇప్పటి ప్రభుత్వం ఊరేగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు సాగు భూములు దూరం చెయ్యడం ప్రభుత్వం చేస్తున్న అతి పెద్ద తప్పు అని తప్పుబట్టారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద ఓ పక్క ప్రభుత్వం మద్దతు కూడగట్టె పనిలో ఉంటే.. ప్రతిపక్ష నాయకులు మాత్రం ప్రాజెక్టుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతులతో ధర్నాలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నేతలు సమావేశాన్ని నిర్వహించారు. మల్లన్న సాగర్ ను అడ్డుకుంటే ఖచ్చితంగా విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.