
ఎనిమిదేళ్ళ చిన్నారి, చనిపోయినట్టు నటించి రేపిస్ట్ నుండి తప్పించుకున్న ఘటన ఢిల్లీ లో వెలుగు చూసింది.
ఇంటి బయట ఉన్న మంచం పై పడుకుని ఉన్న చిన్నారిని, అర్ధరాత్రి 1.30 గంటలకు, ఒక మైనర్ బాలుడు కిడ్నాప్ చేశాడు. అరవాలని చూసిన ఆ చిన్నారి నోరుని ఆ బాలుడు, తన చేయితో మూసేసి, చుట్టు పక్కలే ఉన్న ఒక ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్ళి, అక్కడే తనని రేప్ చేసినట్లుగా సమాచారం. అయితే రేప్ చేస్తున్న సమయంలో, ఆ మూడో తరగతి చదివే పాప, తెలివిగా ఉలుకు పలుకు లేకుండా చనిపోయినట్లుగా నటించింది. అసలే మాత్రం కదలని పాపని చూసిన ఆ బాలుడు, ఖంగారేసి అటునుండి జారుకున్నాడు. అతను వెళ్ళడం గమనించిన చిన్నారి, లేచి తన ఇంటికి వెళ్ళిపోయింది.
విషయం గురించి చిన్నారి తండ్రి మాట్లాడుతూ, "బెడ్ మీద రక్తపు మరకలు చూసి, నా భార్య భయపడింది. తర్వాత కడుపునొప్పి అని, గొంతు మంటగా ఉంది తినలేకపోతున్నానని, చెప్పడంతో ఆ భయం రెట్టింపయి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. సిసి టీవీలో చూసినా కూడా, ఆ బాలుడు ఎవరో కనిపెట్టలేకపోయాం" అని అన్నారు. అయితే పోలీసుల ప్రకారం, ఆ చుట్టూ పక్కల ఉండే మైనర్ పిల్లాడే ఆ పనికి ఒడిగాగట్టాడని తెలుస్తోంది. కేసుని పరిశీలించి, దోషిని తొందరలోనే పసిగడతామని పోలీసులు తెలిపారు.