కొత్త పార్టీ స్థాపించిన షర్మిల

షర్మిల అనుకొంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కాదు..ఇరోం షర్మిల చాను. ఈశాన్య రాష్ట్రాలలో సైనికదళాలకి ప్రత్యేకాధికారాలు రద్దు చేయాలని కోరుతూ ఏకంగా 16 ఏళ్ళపాటు కేవలం ద్రవాహారాలు మాత్రమే తీసుకొంటూ నిరాహార దీక్ష చేసిన ఇరోమ్ షర్మిలా, ఇంకా ఎంత కాలం నిరాహార దీక్ష చేసినా, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా తన డిమాండ్ నెరవేరే అవకాశం కనబడకపోవడంతో తన ఆశే సాధన కోసం వేరే మార్గంలో పోరాటం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో రెండు నెలల క్రితమే నిరవధిక నిరాహార దీక్ష ముగించారు. 

రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని ఆనాడే ఆమె ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆమె ఇవ్వాళ్ళ పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్' రాజకీయ పార్టీ స్థాపించినట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగబోయే మణిపూర్ శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆలోగా రాష్ట్రంలో పార్టీని నిర్మించుకొని బలోపేతం చేసుకొంటామని షర్మిల చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారిన కొన్ని చట్టాలలో మార్పులు చేస్తానని చెప్పారు.