కాంగ్రెస్ నుండి రాజ్యసభకు: చిదంబరం, సిబాల్, జైరాం రమేష్

రాజ్యసభ ఎన్నికలు దేశంలో ఒక అనూహ్య మలుపు తీసుకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుండి మహారాష్ట్రకు మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఉత్తర్ ప్రదేశ్ కు కపిల్ సిబాల్, కర్ణాటక నుండి జైరాం రమేష్ నామినేట్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్య సభ లో సంఖ్యా బలం లేకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ నుండి ఈ ముగ్గురిని బరిలోకి దింపితే, ప్రభుత్వానికి పెద్ద గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.   

ఇతర రాష్ట్రాల నుండి నామినేట్ ఐన వారి జాబితా చూస్తే- కర్నాటక నుంచి ఆస్కార్ ఫెర్నాండెజ్, పంజాబ్ నుంచి అంబికా సోని, ఛత్తీస్గఢ్ నుండి ఛాయా వర్మ, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ తన్ఖ, ఉత్తరాఖండ్ నుండి ప్రదీప్ టంట ఉన్నారు. కర్ణాటక నామినేషన్ను పార్టీ ప్రధాన కార్యదర్శి, పిసిసి చీఫ్, సిఎల్పి నాయకుడు నిర్ణయించారు. మిగతా అన్నీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధి ఎంపిక చేశారు.

మహారాష్ట్ర సీటు కోసం మాజీ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెస్ మాజీ ఎంపి బాలచంద్ర మున్గేకర్ లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఎఐసిసి కార్యదర్శి అవినాష్ పాండే మహారాష్ట్ర నుంచి రిటైర్ అవుతున్నారు.